: గుండెలు పిండేసిన చెన్నై శునకం
కుక్క... జంతువుల్లో దీనిలా మనిషికి విధేయత ప్రకటించేది మరేదీలేదు. విశ్వాసానికి మరోపేరు అని మహాభారత కాలం నుంచి శునకజాతికి పేరు. ఈ చెన్నై శునకం కూడా అలాంటిదే. తన యజమాని ఓ రోడ్డు ప్రమాదంలో మరణించగా, అతని సమాధి నుంచి కదలకుండా అలాగే కూర్చుంది. తిండిలేదు, నిద్రలేదు, ఎండకు, వానకు అలాగే సమాధి వద్ద కూర్చుని తన యజమాని కోసం ఎదురుచూడసాగింది. కుక్క ప్రదర్శించిన విశ్వాసంతో అక్కడి వారి హృదయాలు ద్రవించిపోయాయి. వివరాల్లోకెళితే... భాస్కర్ అనే 18 ఏళ్ళ కుర్రాడు 5 సంవత్సరాల క్రితం ఓ కుక్కను తెచ్చి పెంచుకోసాగాడు. దానికి టామీ అని పేరుపెట్టి కుటుంబంలో ఓ వ్యక్తిగానే పరిగణించాడు. భాస్కర్ తల్లి సుందరి (50) కూడా దాన్ని అల్లారుముద్దుగానే చూసుకునేది. అయితే, మృత్యువు ఓ వాహనం రూపంలో భాస్కర్ ను బలిదీసుకుంది. ఆగస్టు 2న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఈ టీనేజర్ చనిపోవడంతో, అతడిని చెన్నై శివారు ప్రాంతం ఆవడి శ్మశానంలో మతవిశ్వాసాలను అనుసరించి పూడ్చిపెట్టారు. ఓ కుక్క ఆవడి సమాధి వద్ద కాళ్ళతో తవ్వుతుండడాన్ని బ్లూక్రాస్ ఇండియా వలంటీర్లు గుర్తించారు. దాన్ని వారు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా, అది తిరగబడి వారిని తరిమేసింది. వారు అక్కడి వారిని విచారించగా, వారు సుందరి చిరునామా చెప్పారు. సుందరికి విషయం వివరించగా, కొడుకు పోయినప్పటి నుంచి టామీ కనిపించడం లేదని సుందరి వాపోయింది. సమాధి వద్ద ఉన్నది టామీయేనని భావించి శ్మశానం వద్దకు వెళ్ళింది. అక్కడికెళ్ళి చూస్తే... అది టామీయే. సుందరి దాన్ని పిలిచింది. యజమానురాలిని చూస్తూనే దానికి దుఃఖం పొంగుకొచ్చిందేమో... శోకిస్తున్నట్టుగా అరవసాగింది. పాపం, ఒక్కగానొక్క కుమారుడిని పోగొట్టుకున్న ఆ తల్లి... ఇక అన్నీ టామీయేనని భావిస్తానని చెబుతూ, ఆ మూగజీవిని తనతో కూడా ఇంటికి తీసుకువెళ్ళింది.