: ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తే సస్పెండ్ చేయక మరేం చేస్తాం?: యనమల
స్పీకర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి నోటీసులు ఇచ్చామని... ఆయన సరైన వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సభలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవారిని సస్పెండ్ చేయకపోతే మరేం చేస్తారని ప్రశ్నించారు. స్పీకర్ కు చెవిరెడ్డి క్షమాపణ చెబితే వివాదం సమసిపోవచ్చని అన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రతిపక్షం ఎత్తి చూపితే స్వాగతిస్తామని అన్నారు. రేపు రాజమండ్రిలో సీఎం చంద్రబాబు 'జన్ ధన్' కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని... జన్ ధన్ ద్వారా నల్లధనాన్ని అరికట్టవచ్చని చెప్పారు. ప్రతి ఇంటికి బ్యాంకు ఖాతా ఉండటమే జన్ ధన్ పథక ఉద్దేశమని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ వేస్తామని చెప్పారు. కృష్ణా జిల్లా నందిగామ ఎన్నికల గురించి కాంగ్రెస్ పార్టీతో మాట్లాడాల్సింది ఏమీ లేదని... కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించిందని చెప్పారు.