: నేర చరితులు మంత్రులుగా కొనసాగొచ్చా?: నేడే సుప్రీంకోర్టు తీర్పు
నేర చరిత్ర ఉన్నా, పార్లమెంట్ లో అడుగిడి మంత్రి పదవులు అనుభవిస్తున్న మన నేతలను ఆ పదవుల్లో కొనసాగించవచ్చా? లేదా? అన్న విషయం నేడు తేలిపోనుంది. ఈ విషయంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు విచారణ చేపట్టడంతో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. అయితే ఈ తీర్పు తర్వాతైనా తన కేబినెట్ లోని 14 మంది నేర చరితులను ప్రధాని నరేంద్ర మోడీ, పదవుల్లో కొనసాగిస్తారా? లేదా? అన్న విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. మోడీ కేబినెట్ లో అత్యధిక సంఖ్యలో కేసులున్న వారు ఎవరో తెలుసా..?, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి. రెండు హత్య కేసులు సహా ఆమెపై మొత్తం 13 కేసులు నమోదయ్యాయి. ఇక బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీపైనా నాలుగు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మరో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉపేంద్ర కుస్వాహా, రావ్ సాహెబ్ దాదారావ్ దండేలపై నాలుగేసి కేసులు నమోదయ్యాయి. అయితే కేసులు నమోదైనప్పటికీ, ప్రజాస్వామ్య పధ్ధతిలో జరిగిన ఎన్నికల్లో ప్రజామోదం పొందిన తర్వాతనే సభలో అడుగుపెడుతున్న ఎంపీలను, మంత్రి పదవులను చేపట్టొద్దని చెప్పే అవకాశం లేదని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు.