: భారత్, ఇంగ్లండ్ ల మధ్య రెండో వన్డే నేడు... పొంచి ఉన్న వరుణుడు
టీమిండియా, ఇంగ్లండ్ ల మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యహ్నం 3 గంటలకు కార్డిఫ్ లో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. తొలి వన్డే వర్షార్పణం అయిన నేపథ్యంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. అనేక వివాదాల సుడిగుండంలో ఇరుక్కున్న భారత్ కు ఈ మ్యాచ్ లో విజయం చాలా అవసరం. ఓ గెలుపు అన్ని వివాదాలను దూరం చేస్తుందని కెప్టెన్ ధోనీ భావిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో ధావన్, రోహిత్ శర్మలు బ్యాటింగ్ ఆరంభించే అవకాశం ఉంది. తర్వాత కోహ్లి, రహానె, రైనా, ధోనీ బ్యాటింగ్ కు దిగుతారు. వీరితో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తున్నప్పటికీ... ఎవరు ఎంతమేరకు రాణిస్తారనేదే మిలియన్ డాలర్స్ క్వశ్చన్. బౌలింగ్ విభాగంలో... అశ్విన్, జడేజాలకు బెర్త్ ఖరారయినట్టు తెలుస్తోంది. షమి, భువనేశ్వర్, ఉమేష్ యాదవ్ లు పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. మరో వైపు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఇంగ్లండ్ జట్టు... ఈ మ్యాచ్ లో గెలిచి టీమిండియాపై ఒత్తిడిని పెంచాలనే ఆలోచనలో ఉంది. అయితే, ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు కూడా పొంచి ఉంది. రెండో బ్యాటింగ్ సమయానికి వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.