: మహబూబ్ నగర్ లో పొంగి పొర్లుతున్న కల్తీ కల్లు
పాలమూరు జిల్లాలో పాలనురుగు లాంటి విషం అమాయకుల ప్రాణాలు తీస్తోంది. పాలకుల నిర్లక్ష్యంతో మహబూబ్ నగర్ లో కల్తీ కల్లు పొంగి పొర్లుతోంది. ఈ కల్తీ కల్లు తాగి నిండు నూరేళ్లు బతకాల్సిన వారు యుక్త వయస్సులోనే కాటికి పయనమవుతున్నారు. కల్తీ కల్లు తాగి మద్యం ప్రియులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కూలీ పనులకెళ్లేవారు పిల్లలను నిద్రపుచ్చేందుకు ఈ కల్లును వారికి పట్టిస్తున్నారు. దీంతో బాల్యంలోనే పసిపిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. బియ్యం నీళ్లు, క్లోరో హైడ్రేడ్, డైజోఫాం, చాకిరిన్, కుంకుడు కాయల రసం, చక్కెరతో కల్తీ కల్లును తయారుచేస్తున్నారు. ఈ కల్లు తాగడం వల్ల మతిస్థిమితం కోల్పోతారని ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. నరాలు చచ్చుబడిపోవడం, నరాల బలహీనతతో ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. కానీ, కాసులకు కక్కుర్తి పడిన కొందరు కల్లు వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా ఈ కల్తీ కల్లు వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు.