: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతానికి లేనట్టే... వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు రాష్ట్రపతి పాలనే
వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. ఢిల్లీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్రం ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని... దీని వల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఉంటుందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ స్పష్టం చేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టులో ఇటీవలే ఓ పిల్ నమోదు అయ్యింది. ఢిల్లీలో ప్రస్తుతం సుప్తచేతనావస్థ స్థితిలో ఉన్న అసెంబ్లీని సస్పెండ్ చేసి... కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు (ఎలక్షన్ల ద్వారానైనా సరే) ఎలాంటి అవకాశాలున్నాయో తమకు ఐదువారాలలోగా తెలిపాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయానికి సంబంధించి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వివరణ ఇచ్చారు. ప్రస్తుతానికి కేంద్రం ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖంగా లేదని... దీని వల్ల యథావిధిగా వచ్చే ఫిబ్రవరి వరకు ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని వచ్చేనెల సెప్టెంబర్ 9న కోర్టుకు స్పష్టం చేస్తామని తెలిపారు. రాష్ట్రపతి పాలనను రద్దు చేయమని కేంద్రాన్ని ఆదేశించే అధికారం సుప్రీంకోర్టుకు లేదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఒకవేళ ఫిబ్రవరిలోపు ఎవరైనా ప్రభుత్వం ఏర్పాటుకు తగిన సంఖ్యాబలంతో వస్తే ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అటార్నీ జర్నల్ వ్యాఖ్యలతో ఢిల్లీలో మళ్లీ వచ్చే ఏడాది వరకు ఎన్నికలు ఉండవని తేలడంతో... ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ సహాయంతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటుచేయాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.