: భారత పర్యాటకులకు వియత్నాం 'రెడ్ కార్పెట్'


ఆసియాలో అటవీ ప్రాంతం ఎక్కువగా కలిగి ఉన్న దేశాల్లో వియత్నాం ఒకటి. ఆకుపచ్చగా కనువిందు చేసే అడవుల అందాలను సొమ్ము చేసుకునేందుకు వియత్నాం సర్కారు నడుం బిగించింది. ఈ క్రమంలో పర్యాటకానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు అక్కడి అధికారులు. ప్రపంచ విహారానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే భారత టూరిస్టులకు పెద్దపీట వేయాలని అనుకుంటున్నారట. వీసా మినహాయింపు వంటి నిర్ణయాలతో భారతీయులను ఆకర్షించేందుకు ఇప్పుడక్కడి అధికార వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. గతేడాది వియత్నాంలో 70 లక్షల మంది విదేశీ యాత్రికులు పర్యటించగా, వారిలో భారతీయులు కేవలం 10 వేలమందేనట. అది కూడా వ్యాపార పనుల నిమిత్తమే మన వాళ్ళలో అత్యధికులు అక్కడికి వెళ్ళారు. కాగా, వియత్నాంను అత్యధికంగా 19 లక్షమంది చైనీయులు సందర్శించారు. తమ దేశంలో పర్యాటకం పెద్దగా అభివృద్ధి చెందకపోవడంపై కల్చర్, స్పోర్ట్స్, టూరిజం మంత్రిత్వ శాఖ వైస్ చైర్మన్ హోంగ్ థి డియెప్ మాట్లాడుతూ... ఆయా ప్రదేశాలకు కనెక్టివిటీ, తగినమేర ప్రచారం కొరవడడం కారణాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం భారత్ నుంచి నేరుగా వియత్నాంకు విమానసర్వీసులేవీ లేవు. అక్కడికి వెళ్ళాలంటే హాంకాంగ్, సింగపూర్, థాయ్ లాండ్ వెళ్ళి అక్కడ విమానమెక్కాల్సి ఉంటుంది. కాగా, 2011లో జెట్ ఎయిర్ వేస్, వియత్నాం ఎయిర్ లైన్స్ మధ్య నేరుగా విమాన సర్వీసులకు సంబంధించి ఓ ఒప్పందం కుదిరింది. 2013లో ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించారు కూడా. ఆ ఒప్పందాన్ని అనుసరించి ఈ నవంబర్ నుంచి వియత్నాంకు భారత్ నుంచి విమానాలు నడిపే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News