: అధికార, విపక్ష సవాళ్లు ప్రతి సవాళ్లతో దద్దరిల్లిన శాసనమండలి


ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. అధికార, విపక్ష సభ్యుల సవాళ్లు, ప్రతి సవాళ్లతో శాసనమండలి హోరెత్తింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ పై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ ఎస్వీ సతీష్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న 50 లేదా 60 రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తారని మండలికి తెలిపారు. దీంతో విపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. తాము రైతులము కాదని, వాస్తవాలు తమకు కూడా తెలుసని, రైతులను మభ్యపెట్టినట్టు తమను కూడా మభ్యపెట్టడం కుదరదని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ నేతలు వేచిచూడండని సవాలు విసిరారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ సభ్యుడు చెంగల్రాయుడు మాట్లాడుతూ, మాఫీ అంత సులువు కాదని, రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల్లోనే రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. టీడీపీ ఏం చేస్తుందంటూ ఆయన ప్రశ్నించారు. సతీష్ రెడ్డి స్పందిస్తూ ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, తాము రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని అన్నారు.

  • Loading...

More Telugu News