: షిరిడీ సాయిబాబా దేవుడు కాదు... ఆయన్ని ఆరాధించకండి: ధర్మ సంసద్ తీర్మానం
షిరిడీ సాయిబాబా దేవుడు కానే కాదని ధర్మ సంసద్ తీర్మానించింది. ఆయనను ఆరాధించరాదని హిందువులకు పిలుపునిచ్చింది. చత్తీస్ గఢ్ లోని కబీర్ ధామ్ జిల్లాలో రెండు రోజుల పాటు ధర్మ సంసద్ చర్చా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హిందూమతానికి చెందిన 13 అఖారాల ప్రతినిధులు, అనేక మంది హిందూ మత ప్రముఖులు హాజరయ్యారు. సదస్సుకు హాజరుకావాలంటూ షిరిడీలోని సాయి సంస్థాన్ కు కూడా ఆహ్వానం పంపారు. కానీ, షిరిడీ సాయి సంస్థాన్ నుంచి ఎవరూ హాజరుకాలేదు. ఈ సదస్సులో సాయిబాబాపై సమగ్రంగా చర్చించి... ఆయన దేవుడు కాదని తీర్మానం చేశారు. గతంలో కూడా... మాంసాహారం తిన్న సాయిబాబా సన్యాసి కాదని, హిందువులు ఎవరూ ఆయనను ఆరాధించరాదని ద్వారకా శంకరాచార్య ప్రకటించిన సంగతి తెలిసిందే. కాశీ విద్వత్ పరిషత్ కూడా సాయిబాబా దేవుడు కాదని, గురువు కూడా కాదని తీర్మానించిన విషయాన్ని ఈ సదస్సులో గుర్తుచేసుకున్నారు.