: ఏపీ మంత్రిపై నట్టికుమార్ సంచలన ఆరోపణలు
రాష్ట్రాన్ని కొత్తగా నిర్మించాలి, అవినీతిని అంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిస్తుంటే ఆయన సహచరులు మాత్రం అవినీతికి తెరతీశారని చిన్న నిర్మాతల మండలి అధ్యక్షుడు నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఒక మంత్రి, అతని అనుచరులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నారు. 2006-12 వరకు సర్వీసు ట్యాక్స్ మాఫీ చేయిస్తామంటూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఒక్కో థియేటర్ యజమాని వద్ద నుంచి వారు 50 వేల రూపాయల చొప్పున వసూలు చేసారని ఆయన ఆరోపించారు. మంత్రి, ఆయన అనుచరుడు అశోక్‌కుమార్... గోవిందరాజు అనే మధ్యవర్తితో కలిసి 12 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. మంత్రి అనుచరులే కాకుండా ఎన్వీ ప్రసాద్, పూర్వీ రాజు, చిన్ని, జనార్ధన్, అలంకార్ ప్రసాద్‌లకు కూడా ఈ వసూళ్లలో భాగముందని ఆయన స్పష్టం చేశారు. 24 గంటల్లోగా వారందరినీ అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.