: అంజలీ! ప్లీజ్ అంజలీ... కరుణించవా!: కళంజియం


పూలమ్మిన చోటే కట్టెలమ్మడం అంటే ఇదేనేమో..! సినీనటి అంజలిని తమిళ తెరకు పరిచయం చేసిన దర్శకుడు కళంజియం ఆమెను దయనీయ స్థితిలో అభ్యర్థిస్తున్నాడు. మూడు రోజుల క్రితం ప్రకాశం జిల్లా ఒంగోలు వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కళంజియం గతంలో అంజలికి సినిమా కోసం ఇచ్చిన అడ్వాన్సు తిరిగి ఇవ్వాలని కోరుతున్నాడు. ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తున్న సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, కళంజియం తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఇలాంటప్పుడు అంజలి తన డబ్బులు వాపస్ చేస్తే బాగుండునని అతను కోరుకుంటున్నాడు. అయితే ఈ డబ్బుపై కళంజియం ఇంతకుముందు రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. అంజలిపై పరువు నష్టం పిటిషన్ కూడా వేశాడు. తమిళ నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయకూడదని సినీ అసోసియేషన్ ముందు పంచాయతీ పెట్టాడు. సినిమా చేసేందుకు అడ్వాన్స్ తీసుకుని ప్లేటు ఫిరాయించిందంటూ కళంజియం కోర్టు తలుపు తట్టాడు. ఆ తరువాత ఆమె పిన్ని పెట్టిన మిస్సింగ్ కేసులో కూడా కళంజియం ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలొచ్చిన సంగతి తెలిసిందే. అతని వేధింపులు తాళలేకే అంజలి దాక్కుందన్న వార్తలు కూడా విదితమే. ఇప్పుడు అదే దర్శకుడు దయనీయస్థితిలో ఆమెను వేడుకుంటున్నాడు.

  • Loading...

More Telugu News