: ఆ ఏడుగురినీ ఎన్ కౌంటర్ చేయాలి... కుంభీపాకమే కరెక్ట్ అంటున్న నెటిజన్లు
స్నేక్ గ్యాంగ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ ఆరుగుర్నీ ఎన్ కౌంటర్ చేసి పడేయాలని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడి రోడ్డు మీద ఉరితీయాలని కొందరు పేర్కొంటుండగా... కాదుకాదు, స్నేక్ గ్యాంగ్ కు కుంభీపాకమే (నూనెలో వేయించి తీయడం) కరెక్ట్ అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో, వారు బాధితులను పాములతో ఎలా భయపెట్టారో, అలాగే వారిని పాములతో కరిపించి చంపాలని కోరుతున్నారు. రోడ్డుమీద కళ్ల ముందు దారుణం జరిగిపోతున్నా స్పందించని జనం సామాజిక మాధ్యమాల్లో మాత్రం విపరీతంగా స్పందిస్తున్నారు. సభ్యసమాజం తల దించుకునేలా, సామూహికంగా ఓ మగువ మానాన్ని మంటగలిపిన కామాంధులను నేరుగా కాటికి పంపడమే సరైన శిక్ష అని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. హైదరాబాద్ పహాడీషరీఫ్‌లో కాబోయే భర్త ఎదుటే ఓ యువతిపై ఏడుగురు రాక్షసులు కీచకపర్వం సాగించారన్న వాస్తవం వెలుగులోకి రావడంతో జనం రగిలిపోతున్నారు. కాలనాగులతో బెదిరించి దుశ్శాసన పర్వానికి ఒడిగట్టిన పరమ దుర్మార్గులు- ఫైసల్ దయానీ, ఖాదర్ బారక్‌బా, తయ్యబ్ బాసలామా, మహ్మద్ పర్వేజ్ తో పాటు మరో ముగ్గురి పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడంతో జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హత్యలు, దారి దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలకు పాల్పడడమే కాకుండా సెల్ఫోన్లలో నగ్నంగా ఫోటోలు తీసి బెదిరించడం, రౌడీయిజం చేయడం వంటి ఆగడాలకు ఎంత మంది బలయ్యారోనని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిని క్షమించడం కాకుండా వీరికి అండగా ఉన్నవారెవరైనా వారినీ వదలకుండా కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.