: బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ ఇంటి బయట కాల్పులు
హిందీ చిత్రం 'చెన్నై ఎక్స్ ప్రెస్' నిర్మాత కరీం మొరానీ ఇంటి బయట కాల్పులు జరిగాయి. ఈ ఘటన మూడు రోజుల (శనివారం) కిందట జరగగా, నిర్మాత పోలీసులకు నిన్న (ఆదివారం) ఫిర్యాదు చేశారు. ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి తన ఇంటి బయట కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. తర్వాత అక్కడి నుంచి వారు వెళ్లిపోగా తన ఫోన్ కు బెదిరింపు మెసేజ్ వచ్చినట్లు చెప్పారు. హత్యాయత్నం కింద, గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులపై ముంబయి జూహూ పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా, పరారీలో ఉన్న గ్యాంగ్ స్టర్ రవి పూజారి పేరిట నుంచి కొన్ని నెలలుగా నిర్మాత మొరానీకి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దాంతో, తనకు రక్షణ ఇవ్వాలని ఆయన పోలీసులను కూడా కోరారు. ఇంతవరకు వారు ఎలాంటి రక్షణ ఇవ్వకపోవడం గమనార్హం. గతంలో 2జీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఈ నిర్మాతను సీబీఐ అరెస్టు చేసింది. అనంతరం బెయిల్ పై బయటకు వచ్చారు.