: ట్యూషన్ చెబుతున్నానయ్యా... నేర్చుకోండి: టీడీపీ సభ్యులతో జగన్
గడచిన పదేళ్లలో ఏ లెక్క ప్రకారం చూసినా అభివృద్ధి బ్రహ్మాండంగా ఉన్నా... తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం గవర్నర్ ప్రసంగం నుంచి బడ్జెట్ ప్రసంగం వరకు ప్రతిచోటా గత ప్రభుత్వాల్ని అనవసరంగా ఆడిపోసుకుంటోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్ మీద అసెంబ్లీలో ప్రారంభమైన చర్చలో ఆయన అధికారపక్షం మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. గడచిన పదేళ్లలో చాలా అన్యాయం జరిగిపోయిందని, అంతకుముందు తాము అద్భుతంగా పాలించామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ప్రస్తుతం తామిచ్చిన హామీలు నెరవేర్చలేక... చంద్రబాబు ప్రభుత్వం 20 ఏళ్ల కిందకు వెళ్లి... అప్పుడు తాము పరిపాలన బాగా చేశామని, ఆ తర్వాత అంతా సర్వనాశనమైపోయిందని చెప్పుకొస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తామిచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాకే... గత ప్రభుత్వాల మీద నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదంతా చూస్తుంటే తనకు 'ఆడలేక మద్దెల ఓడు' అనే సామెత గుర్తుకొస్తోందని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం 'ఆత్మస్తుతి పరనింద' లాగా చేస్తోందని వ్యాఖ్యానించారు. జగన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో... మీ నుంచి మేం నేర్చుకోనవసరం లేదని టీడీపీ సభ్యులు అనడంతో 'ట్యూషన్ చెబుతున్నానయ్యా... నేర్చుకోండి' అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చురకలు అంటించారు.