: విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపాలనుకుంటున్న జగన్!


జగన్ అక్రమాస్తుల కేసులో ఏ-2 నిందితుడిగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డిని వైకాపా నుంచి రాజ్యసభకు పంపనున్నారనే ప్రచారం మీడియా వర్గాల్లో జోరందుకుంది. విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారని సమాచారం. తనకు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డికి జగన్ ఇటీవలే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. వాస్తవానికి విజయసాయిరెడ్డి గత ఎన్నికల బరిలోనే రంగంలోకి దిగాలనుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి పోటీ చేసేందుకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ సమీకరణాలు కుదరక... చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు. ఆ సమయంలోనే జగన్ విజయసాయికి రాజ్యసభ సీటు హామీ ఇచ్చారని వైకాపా వర్గాలు అంటున్నాయి. విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపడం కోసం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఏ పార్టీలోనైనా కీలక వ్యక్తులకే రాజ్యసభ సీటు ఇస్తారు. విజయసాయిరెడ్డిని డైరెక్ట్ గా రాజ్యసభకు పంపిస్తే ఇంటా బయట విమర్శలు వచ్చే ప్రమాదముందని భావించే... జగన్ ఇటీవల ఆయనకు ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టినట్టు సమాచారం. కొన్నాళ్లు ప్రధానకార్యదర్శిగా పనిచేసిన తర్వాత రాజ్యసభకు పంపిస్తే... ఎటువంటి విమర్శలు రావనే ఆలోచనలో జగన్ ఉన్నారని వారు అభిప్రాయపడుతున్నారు. గతంలో వైఎస్ హయాంలో విజయ సాయిరెడ్డి టీటీడీ సభ్యుడిగా పనిచేశారు.

  • Loading...

More Telugu News