: మధ్యప్రదేశ్ ఆలయంలో తొక్కిసలాట, పది మంది మృతి
మధ్యప్రదేశ్ లోని ఓ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో పది మంది మృత్యువాత పడ్డారు. మరో 30 మంది దాకా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దులోని వింధ్యా పర్వత ప్రాంతంలోని శ్రీ కంఠనాథ ఆలయంలో సోమవతి అమావాస్య నేపథ్యంలో ప్రత్యేక పూజలు జరుపుతున్న క్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో పది మంది మరణించారని సత్నా జిల్లా కలెక్టర్ చెప్పారు. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయన్న ప్రచారంతో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారిలో ఆరుగురు మహిళలున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం తెల్లవారుజామునే చోటుచేసుకున్న ఈ ఘటనపై ఉదయం 5.30 గంటలకు సమాచారం అందిందని రేవా రేంజీ ఐజీ తెలిపారు. గతేడాది అక్టోబర్ 13న రాష్ట్రంలోని రతన్ గఢ్ ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 115 మంది మరణించగా, వంద మందికి పైగా భక్తులు గాయపడ్డ సంగతి తెలిసిందే.