: సికింద్రాబాదు - కాకినాడ మధ్య 8 ప్రత్యేక రైళ్లు
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాదు - కాకినాడ మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నడికుడి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం మీదుగా నాలుగు రైళ్లు, కాజీపేట, విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమండ్రి మీదుగా మరో నాలుగు రైళ్లు నడుస్తాయని రైల్వే సీపీఆర్వో సాంబశివరావు చెప్పారు. నడికుడి, గుంటూరు మీదుగా నడిచే రైళ్లు (రైలు నెం. 07101, 07102) ఆగస్టు 29, సెప్టెంబరు ఒకటో తేదీల్లో సాయంత్రం 6.35కి సికింద్రాబాదులో బయల్దేరతాయి. ఇదే మార్గంలో ఆగస్టు 28, 31 తేదీల్లో కాకినాడ నుంచి రాత్రి 10 గంటలకు బయల్దేరతాయి. కాజీపేట, విజయవాడ మీదుగా నడిచే రైళ్లు (రైలు నెం.07201, 07202) ఆగస్టు 28, 31 తేదీల్లో సికింద్రాబాదు స్టేషన్ నుంచి రాత్రి 10.20 గంటలకు బయల్దేరతాయి. ఇదే మార్గంలో ఆగస్టు 29, సెప్టెంబరు ఒకటో తేదీన కాకినాడ స్టేషన్ నుంచి సాయంత్రం 6.15 గంటలకు బయల్దేరతాయి.