: ఆర్టీసీ ఉద్యోగుల పీఎఫ్... రూ.160 కోట్లు హాంఫట్!


ఆర్టీసీ ఉద్యోగుల భవిష్య నిధికి చెందిన కోట్లాది రూపాయల సొమ్ము... ఒకటి, రెండూ కాదు, ఏకంగా 160 కోట్ల రూపాయలను సంస్థ యాజమాన్యం వాడేసుకుంది. పిల్లల చదువులు, వివాహాలు తదితర భవిష్యత్ అవసరాల కోసం ఉద్యోగులకు ఉపయోగపడాల్సిన సొమ్మును ఆర్టీసీ యాజమాన్యం తన అవసరాలకు ఖర్చు పెట్టేసింది. ఇతర సంస్థల్లో అయితే, ఉద్యోగుల మూలవేతనాన్ని బట్టి కొంత భాగాన్ని తీసి పీఎఫ్ కు జమ చేస్తారు. యాజమాన్యం కూడా అంతే మొత్తాన్ని కలిపి భవిష్య నిధిలో జమ చేస్తారు. కానీ, ఆర్టీసీ పీఎఫ్ కోసం ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఎండీ ఛైర్మన్ గా ఉండే ఈ ట్రస్ట్ లో గుర్తింపు పొందిన కార్మిక సంఘం సభ్యులకు కూడా ప్రాతినిధ్యం కల్పించారు. అందులో జమ అయ్యే పీఎఫ్ మొత్తాన్ని ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టి ఆ మేరకు వడ్డీ రూపంలో ఆదాయాన్ని ఆర్టీసీ పొందుతుంది. ఆ మొత్తాన్ని కార్మికుల సంక్షేమం కోసం వినియోగిస్తారు. కార్మికులు అత్యవసర సమయాల్లో దరఖాస్తు చేసుకుంటే నిర్థారిత సమయంలో వారికి పీఎఫ్ సొమ్మును అందిస్తారు. గత మూడు నెలలుగా ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి పీఎఫ్ డబ్బులు విడుదల కావడం లేదు. ఇప్పటికే 6500 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. విషయం ఏమిటని ఆరా తీసిన కార్మికులకు కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయాయన్న చేదు నిజం తెలిసింది. మే నెల నుంచి పీఎఫ్ మొత్తాన్ని అసలు భవిష్య నిధి ట్రస్టుకు జమ చేయడం లేదని తెలిసింది. ప్రతి నెలా పీఎఫ్ ట్రస్ట్ లో జమ చేయాల్సిన 40 కోట్ల రూపాయలను (ఇందులో కార్మికుల వాటా 20 కోట్లు) దారి మళ్లించినట్లు తేలింది. నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ... రోజువారీ అవసరాలకు ఈ పీఎఫ్ సొమ్మును వాడుకున్నట్లు సమాచారం. కార్మికులు దాచుకున్న సొమ్మును ఆర్టీసీ వాడుకోవడం దారుణమని, దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని ఎన్ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. తక్షణమే ఆర్టీసీ యాజమాన్యం ఆ మొత్తాన్ని భవిష్య నిధి ట్రస్టుకు జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పీఎఫ్ సొమ్మును వాడుకోవడమంటే కార్మికులను దగా చేయడమేనని, ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సిన రూ.750 కోట్లను విడుదల చేయకపోవడమే దీనికి కారణమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారని ఈయూ నేత దామోదర్ రావు అన్నారు.

  • Loading...

More Telugu News