: శ్రీనివాస మంగాపురానికి క్యూ కడుతున్న 'పెళ్లికాని ప్రసాదులు'
రోజు వేల సంఖ్యలో వస్తోన్న పెళ్లి కాని ప్రసాదులతో శ్రీనివాస మంగాపురంలో ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం కిటకిటలాడుతోంది. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని... గుడిలో ఇచ్చే కల్యాణ కంకణాలు కట్టుకుంటే ఆరు మాసాల్లోపు పెళ్లిళ్లు జరుగుతాయని అనాదిగా పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తుల నమ్మకం. నిన్నమొన్నటి వరకు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రజలే కల్యాణ వెంకటేశ్వరస్వామి దర్శనానికి ఎక్కువగా వచ్చేవారు. అయితే ఈ నమ్మకం ఆ నోట... ఈ నోట పడి ఇటీవల కాలంలో బాగా వ్యాప్తిలోకి వచ్చింది. స్వామి విశిష్టత ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం చెందడంతో... ఇప్పుడు కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. భక్తుల నమ్మకానికి తగ్గట్టుగా ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న వెంటనే పెళ్లికాని అమ్మాయిలకు..అబ్బాయిలకు వెంటనే పెళ్లిళ్లు జరగడంతో ఇటీవల కాలంలో ఇంకా బాగా పాప్యులారిటీ వచ్చింది. ఈ కారణంగా ఇటీవల కాలంలో ఈ గుడికి ఎన్నడూ లేనంత రద్దీ పెరిగింది. తిరుపతికి సరిగ్గా 12 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. వివిధ దోషాల కారణంగా పెళ్లిళ్లు ఆలస్యమవుతోన్న అమ్మాయిలు, అబ్బాయిలు... వారి తల్లిదండ్రులు ప్రతీ రోజు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు ఎగబడుతున్నారు. వీరితో పాటు స్వామి వారిని దర్శించుకున్న తర్వాత పెళ్లైన అబ్బాయిలు, అమ్మాయిలు... జంటలుగా స్వామి వారి పున:దర్శనం కోసం వస్తున్నారు. దీంతో ప్రస్తుతం రోజుకి 30 నుంచి 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక స్థలప్రాశస్త్యం వివరాల్లోకి వెళితే... పద్మావతి అమ్మవారిని వివాహమాడిన వెంకటేశ్వరుడు తిరుమల గిరులకు ఈమార్గం గుండా వెళ్తుంటే... నూతన వధూవరులు గిరుల పర్యటన చేయకూడదని అగస్త్యమహాముని సూచించారని... దాంతో శ్రీవారు శ్రీనివాస మంగాపురంలోనే ఆరు నెలలు పాటు ఉండిపోయారన్నది పురాణప్రాశస్త్యం. ఈ కారణంగానే తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రానుసారం ఎలాంటి పూజలు, కైంకర్యాలు జరుగుతాయో శ్రీనివాస మంగాపురంలోను అదే తరహాలో పూజా కైంకర్యాలు జరుగుతాయి.