: బాలల కొరకు, బాలల చేత... బాలల బ్యాంకు!
సర్జన్ బ్యాంకు! బాలల కొరకు ఏర్పాటు చేయబడ్డ బ్యాంకు. బాలలే దీనిని నడిపిస్తున్నారు, అవును, అక్కడ పనిచేసే వారంతా బాలలే. ఇక ఖాతాదారులు ఎవరనుకుంటున్నారు..? వారూ బాలలే. పేద ముస్లిం కుటుంబాల పిల్లలకు పొదుపు మంత్రం అలవాటు చేసేందుకు సర్జన్ అనే స్వచ్ఛంద సంస్థ... అహ్మదాబాద్ లోని దేశంలోనే అతిపెద్ద ముస్లిం వాడగా పేరొందిన జహపురాలో ఈ బ్యాంకును ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ బ్యాంకులో 50 మంది పిల్లలు ఖాతాలను తెరిచారు. రోజూ తల్లిదండ్రులిచ్చే చిన్నపాటి మొత్తాన్ని జహపురా వాడకు చెందిన బాలలు ఆ బ్యాంకులో దాచుకుంటున్నారు. రిక్షా డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ వ్యక్తి పదకొండేళ్ల కూతురు ఆయేషా, ఈ బ్యాంకుకు మేనేజర్ గా పనిచేస్తోంది. క్యాషియర్ గా పనిచేస్తున్న బాలిక అమీన్, ఆయేషా కంటే చిన్నదే. ఈ బ్యాంకులో మొత్తం డిపాజిట్ల విలువ రూ.19,500. పదేళ్ల వయసున్న రుజాన్, తన ఖాతాలో రూ.300 ఉన్నాయని గర్వంగా చెబుతోంది. ఆటోమోబైల్ రంగంలో కార్మికుడుగా పనిచేస్తున్న తన తండ్రి నెలనెలా క్రమం తప్పకుండా ఇచ్చే పాకెట్ మనీలో మెజార్టీ భాగాన్ని తన బ్యాంకు ఖాతాకే తరలిస్తానని కూడా ఆ బాలిక చెప్పింది. అవసరాలను బట్టి, తమ ఖాతాదారులకు రుణాలు కూడా మంజూరు చేస్తామని చెప్పే ఆయేషా, నగదు విత్ డ్రా చేసుకునే ఖాతాదారులు కారణం చెబితేనే అందుకు అనుమతిస్తామని కాకలు తీరిన బ్యాంకర్ మాదిరే చెబుతోంది. ఖాతాలో జమ చేసే మొత్తాన్ని కష్టకాలంలో తప్పించి, అనవసర వ్యయాలకు ఖర్చు చేయబోమని ఖాతాదారుల చేత ప్రమాణం కూడా చేయిస్తున్నట్లు ఆయేషా చెబుతోంది.