: కేబీఆర్ పార్క్ పేరును అసఫ్ జాహి పార్క్ గా మార్చనున్న టీఎస్ సర్కార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్న వివిధ సంస్థల పేర్లు మార్చే విషయంలో తలమునకలై ఉంది. హైదరాబాద్ లో ఉన్న విద్యాలయాలు, పరిశోధన కేంద్రాలు, పార్క్ ల పేర్లను మార్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లో ఉన్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరును... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చింది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా ఇదే క్రమంలో, హైదరాబాద్ లో టీడీపీ భవన్ ఎదురుగా ఉన్న ప్రఖ్యాత కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్)పార్క్ పేరును మార్చాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఇటీవలే ఓ సభలో పాల్గొన్నప్పుడు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రకటించారు. ఈ పార్క్ కు ప్రస్తుతమున్న పేరు తీసి వేసి.. సరైన కొత్త పేరు పెట్టాలనుకుంటున్నామని మహమూద్ అలీ పేర్కొన్నారు. దీనికి అసఫ్ జాహి పార్క్ గా నామకరణం చేయాలని టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.