: గణేశ్ నిమజ్జనానికి నీటి సమస్య


భాగ్యనగరంలో ఏటా ప్రతిష్ఠాత్మకంగా జరిగే గణేశ్ నిమజ్జనానికి నీటి సమస్య వచ్చి పడింది. వినాయక నిమజ్జనానికి వరుణుడు ఈసారి రెడ్ సిగ్నల్ ఇస్తున్నాడు. వర్షాలు సరిగా పడకపోవడంతో చెరువులు నిండలేదు. కొన్ని చెరువుల్లో అయితే ఎండిపోయి... చుక్క నీరు కూడా లేకుండా పోయింది. దీంతో గణపయ్యను నిమజ్జనం ఎలా చేయాలా? అని భక్తులు టెన్షన్ పడుతున్నారు. హుస్సేన్ సాగర్ లో విగ్రహాల రద్దీ పెరగడంతో... గత కొన్నేళ్లుగా గ్రేటర్ హైదరాబాదు పరిసరాల్లోని చెరువుల్లో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కూడా దగ్గర్లోని చెరువుల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశిస్తున్నారు. మరి, ఈసారి చెరువుల్లో తగినంత నీరు లేకపోవడంతో హైదరాబాదులోని వేలాది విగ్రహాల నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ పైనే ఆధారపడే పరిస్థితి కన్పిస్తోంది. వినాయక చవితి నవరాత్రులు హైదరాబాదులో అంగరంగ వైభవంగా జరుగుతాయన్న సంగతి తెలిసిందే. వాడవాడలా గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు జరిగే పూజల్లో యువకులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు. అయితే, విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను వాడవద్దని నిపుణులు సూచిస్తున్నారు. రసాయనిక రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల కాలుష్యం పెరిగిపోయిందని, నీరు కలుషితమవుతుందని వారు చెబుతున్నారు. మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News