: తెలంగాణలో విద్యుత్ కటకట... అల్లాడుతున్న ప్రజలు, రైతన్నలు
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రమయింది. కరెంట్ కష్టాలతో తెలంగాణ పల్లెలు అల్లాడుతున్నాయి. పల్లె ప్రజలు పగటి పూట కరెంట్ సంగతి పూర్తిగా మరిచిపోయారు. ఇక రాత్రి వేళల్లో కూడా కరెంట్ చాలా పరిమితంగా సరఫరా అవుతోంది. కోతల నిడివి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇక కరెంట్ కోతలతో తెలంగాణ రైతన్నల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రోజుకి రెండు నుంచి నాలుగు గంటల మాత్రమే పొలాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. అది కూడా ఒకేసారి కాకుండా దఫదఫాలుగా చేస్తుండడంతో... కొద్ది కొద్దిగా వస్తున్న నీళ్లు పొలాన్ని కొద్దిగా కూడా తడపలేకపోతున్నాయని... దీని వల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేళాపాళాలేని కరెంట్ కోతలతో గృహ వినియోగదారులు, చిన్నతరహా కుటీర పరిశ్రమలు నిర్వహించేవారు, చిరు వ్యాపారులు, కరెంటుపై ఆధారపడ్డ కులవృత్తుల వారు.. ఇలా ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర రాజధాని... హైదరాబాద్ లో కూడా రోజుకు ఆరు గంటలకు పైగా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారంటే విద్యుత్ సంక్షోభం రాష్ట్రంలో ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ లోటు అసాధారణ స్థాయికి చేరుకుందని... డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోతలు అమలుచేస్తున్నామని విద్యుత్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో ట్రాన్స్ కో, జెన్ కో ఉన్నతాధికారులు పూర్తిగా చేతులెత్తేశారు. డిమాండ్ 154 మిలియన్ యూనిట్లు ఉండగా... ఉత్పత్తి మాత్రం 128 యూనిట్లే ఉందని... దీనివల్ల 25 మిలియన్ యూనిట్ల లోటు ప్రతీరోజు వస్తోందని వారు అంటున్నారు. ఈ కారణంగా విద్యుత్ కోతలను అమలుచేయక తప్పని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని వారు చెబుతున్నారు.