: సైకిల్ దిగి కారెక్కనున్న తుమ్మల?
తెలంగాణలో కీలక టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరనున్నారా? అవుననే అంటున్నారు టీఆర్ఎస్ ముఖ్యులు. ఈ విషయమై ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ తో చర్చలు ముగిశాయని... త్వరలోనే తుమ్మల చేరిక కార్యక్రమం ఉంటుందని అంటున్నారు. టీఆర్ఎస్ లో చేరిన వెంటనే మంత్రి పదవి కట్టబెడతామని... ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీని చేస్తామని తుమ్మలకు కేసీఆర్ హామీ ఇచ్చినట్టు సమాచారం. టీఆర్ఎస్ లోకి తుమ్మల చేరితే... కమ్మ సామాజికవర్గాన్ని కొంత వరకైనా తమవైపు తిప్పుకోవచ్చన్న అంచనాల్లో ఆ పార్టీ ఉంది. ఇది రాజకీయంగా తమకు ఎంతగానో లాభిస్తుందని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో, జ్వరంతో బాధపడుతున్న తుమ్మలను నిన్న టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి, మండవ వెంకటేశ్వరరావులు పరామర్శించారు. తుమ్మల పార్టీ మారే యోచనలో ఉన్నారనే ప్రచారం నేపథ్యంలోనే వీరు తుమ్మల నివాసానికి వెళ్లినట్టు సమాచారం. అయితే, పార్టీ కేడర్, నాయకుల ఇష్టాలకు వ్యతిరేకంగా తాను ఏమీ చేయనని... ఇదే విషయాన్ని కేసీఆర్ కు కూడా చెప్పానని ఇరువురు నేతలకు తుమ్మల చెప్పినట్టు తెలుస్తోంది.