: అద్వానీ రిక్వెస్ట్ కు... అమిత్ షా నో...!


అవును. ఇది నిజంగా నిజం. బీజేపీ అగ్రనేత, పార్టీకి ఒకప్పుడు మూల స్తంభంగా నిలిచిన అద్వానీ కోరితే, నిన్నగాక మొన్న వచ్చిన అమిత్ షా నో చెప్పడమేంటి..? ఇదంతా ఖర్చులను తగ్గించుకోవాలన్న ప్రధాని మోడీ మంత్రం ప్రభావమే. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ, కేబినెట్ సహచరులు, ప్రభుత్వ అధికారులు ఆచితూచి ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తద్వారా పొదుపు మంత్రాన్ని జపించాలని చెప్పకనే చెప్పారు. ప్రభుత్వం తీరు ఎలా ఉన్నా, మోడీకి అత్యంత సన్నిహితుడిగా పేరుపడిన అమిత్ షా మాత్రం మోడీ పొదుపు మంత్రాన్ని జపిస్తున్నారు. పార్టీ నేతలు అత్యవసరమైతే తప్పించి చార్టర్డ్ ఫ్లైట్ లను వినియోగించరాదని తేల్చిచెబుతూ, వీలయితే రైలు ప్రయాణాలు సాగించాలని సూచించారు. అంతేనా, పార్టీ కార్యక్రమాల కోసం సొంతూరు దాటే నేతలు, స్టార్ హోటళ్లలో కాకుండా ప్రభుత్వ అతిథి గృహాల్లో విశ్రమించాలని కూడా షా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మొన్నామధ్య తనకు ఓ చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేయాలంటూ అద్వానీ, పార్టీ కార్యాలయానికి సందేశం పంపారు. అయితే ఆ సందేశం వెళ్లిన వేగంతోనే ఖాళీగా తిరిగి వచ్చిందట. దీంతో ఒకింత అసహనానికి గురైన అద్వానీ, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షాకు సన్నిహితంగా ఉండే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వద్ద తన గోడు వెళ్లబోసుకున్నారట. పరిస్థితిని అర్థం చేసుకున్న జైట్లీ, ఈ విషయంలో ఏమీ చేయలేకపోయారని వినికిడి. అమిత్ షా చర్యతో చిన్నబుచ్చుకున్న అద్వానీ, పార్టీ పంపిన ఫ్లైట్ టికెట్ ను తిరస్కరించారని సమాచారం.

  • Loading...

More Telugu News