: స్కూటర్ డిక్కీలో ఉన్న రూ.9 లక్షలు కొట్టేశారు
హైదరాబాదులో దొంగలు పేట్రేగిపోతున్నారు. డబ్బు దొంగలించడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. హైదరాబాదు నగరంలో తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. చైతన్యపురం ఐసీఐసీఐ బ్యాంకు వద్ద ఓ ఖాతాదారుడి నుంచి రూ.9 లక్షలను చాకచక్యంగా తస్కరించారు. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి 9 లక్షల రూపాయలను డ్రా చేసుకున్న ఖాతాదారుడు ఆ సొమ్మును తన స్కూటర్ డిక్కీలో భద్రపరిచాడు. ఆ విషయాన్ని గమనించిన ఆగంతుకులు దృష్టి మరల్చి చోరీకి పాల్పడ్డారు. స్కూటరు పంక్చర్ వేయించుకుంటున్న సమయంలో వారు డిక్కీలో నుంచి ఆ డబ్బును మాయం చేశారు. చోరీ జరిగిన విషయం తెలుసుకున్న ఖాతాదారుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.