: పరిటాల రవి హత్య కేసు రీ-ఓపెన్?: కేసును ప్రత్యేకంగా స్టడీ చేస్తోన్న ఏపీ డీజీపీ
పరిటాల రవి హత్య కేసును రీఓపెన్ చేయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడుకు ఆయన తెలియజేసినట్టు సమాచారం. పరిటాల రవి హత్యతో పాటు... ఆ కేసులో నిందితులు ఒక్కొక్కరు వెంటవెంటనే చనిపోవడం వెనుక ఏదో పెద్ద గూడుపుఠాణీ ఉందని టీడీపీ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే, పరిటాల రవి హత్య వెనుక ఎవరి కుట్ర ఉందనే విషయాన్ని ఏపీ పోలీసులు చేధించాలని చంద్రబాబు ఆదేశించారు. సాక్షాత్తూ చంద్రబాబే చెప్పడంతో డీజీపీ జేవీ రాముడు ఈ కేసును ఇప్పుడు ప్రత్యేకంగా స్టడీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో త్వరలో ఈ కేసు రీఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అసలు పరిటాల రవి హత్య వెనుక ఉన్నది ఎవరు...మర్డర్ ప్లాన్ ఎలా జరిగింది... అసలు నిందితులు ఎవరు...ఎవరి వల్ల పరిటాల రవి కేసు నీరుగారిపోయింది? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందిన వెంటనే పరిటాల సునీత తన భర్య హత్య కేసును రీఓపెన్ చేయాలని కోరారు. తన భర్త హత్య వెనుక వైఎస్ జగన్ కుట్ర ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. దీంతో పాటు అప్పటిముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పరపతితో సీబీఐ ఎంక్వయిరీని కూడా నీరుగార్చారని ఆమె కొంతకాలంగా ఆరోపిస్తున్నారు.