: కొల్హాపూర్ అక్కాచెల్లెళ్లకు మరణశిక్ష నుంచి తాత్కాలిక ఉపశమనం
మరణ శిక్ష ఎదుర్కొంటున్న మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు చెందిన రేణుకా షిండే (45), సీమా గవిట్ (39)అనే అక్కాచెల్లెళ్లకు ముంబయి హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. వీరిద్దరి ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. ఈ మేరకు వారి పిటిషన్ ల ఆధారంగా కోర్టు ఎరవాడ జైలు అధికారి, కేంద్ర ప్రభుత్వ వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించేవరకు వారికి మరణశిక్ష అమలు ఉండదు. ఈ కేసుపై విచారించడానికి ఇది అధికార పరిధిలోనే ఉందని, అక్కాచెల్లెళ్లు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా దానిని నిర్ణయిస్తామని జస్టిస్ విఎం.కనడే, జస్టిస్ పిడి.కొడేల హైకోర్టు బెంచ్ ఈ సందర్భంగా పేర్కొంది. అంతేగాక, దోషుల క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి తిరస్కరించిన క్రమంలో మితిమీరిన జాప్యంపై సమాధానం, వివరణ ఇవ్వాలని కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అటు ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు మహిళ హక్కుల సంస్ధ 'మజ్లిస్'కు అనుమతించింది. అనంతరం విచారణను సెప్టెంబర్ 9కి కోర్టు వాయిదా వేసింది. జులై 31న వారిద్దరి పిటిషన్ లను రాష్ట్రపతి తిరస్కరించారు. అయినా ఇప్పటి వరకు వారి మరణశిక్షను అమలు చేయలేదు!