: రాజ్ భవన్ ను వీడేది లేదు: ఉత్తరాఖండ్ గవర్నర్ ఖురేషి
నరేంద్ర మోడీ సర్కారుకు ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషి షాకిచ్చారు. రాష్ట్రపతి విశ్వాసానికి విఘాతం కలిగించనంత వరకు తనను పదవి నుంచి తప్పించే అధికారం మోడీ సర్కారుకు ఎక్కడిదని ప్రశ్నిస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఖురేషీ దాఖలు చేసిన పిటిషన్, సుప్రీం చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం ముందు గురువారం విచారణకు రానుంది. యూపీఏ హయాంలో గవర్నర్లుగా నియమితులైన పలువురు గవర్నర్లు బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చాక తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే ఖురేషి మాత్రం మోడీ సర్కారుపై ప్రత్యక్ష యుద్ధానికి తెర తీశారు. పదవి నుంచి తప్పుకోవాలంటూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి పేరిట రాజ్ భవన్ కు ఆదేశాలు రావడాన్ని ఈ సందర్భంగా ఖురేషి తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ చర్య గవర్నర్ హోదాను కించపరిచేదేనని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో ఆరోపించారు. రాష్ట్రపతి చేత నియమితులయ్యే గవర్నర్లను పదవి నుంచి తప్పుకోండంటూ ఆదేశించే అధికారం కేంద్ర హోం శాఖ కార్యదర్శికెక్కడిదని ఖురేషి వాదన. ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగేలా రాష్ట్రపతి చేత నియమితుడైన తనకు, రాష్ట్రపతి విశ్వాసం కోల్పోనంత కాలం పదవిలో కొనసాగేందుకు అర్హత ఉందని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. మరి సుప్రీం కోర్టు ఈ విషయంపై ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో వేచి చూడాల్సిందే.