: లక్ష కోట్లతో ‘డిజిటల్ ఇండియా’: కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం
భారత దేశాన్ని పూర్తిస్థాయిలో డిజిటల్ దేశంగా మార్చే బృహత్తర కార్యక్రమానికి మోడీ సర్కార్ పచ్చజెండా ఊపింది. ‘డిజిటల్ ఇండియా’ పేరుతో రూ. లక్ష కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున కేంద్రం చేపట్టనుంది. ఇందులో భాగంగా అన్ని రంగాల ప్రభుత్వ సేవలను ప్రజలకు ఎలక్ట్రానిక్ విధానంలో అందుబాటులోకి కేంద్రం తీసుకురానుంది.‘డిజిటల్ ఇండియా’ పథకానికి బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ అనంతరం టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ పథకాన్ని ఈ ఏడాది మొదలుపెట్టి 2018లోపు పూర్తిచేస్తామన్నారు. అన్ని మంత్రిత్వశాఖలు చేపట్టే ప్రాజెక్టులన్నీ ఈ పథకంలో భాగంగా ఉంటాయని... ఈ పథకం అమలుకు లక్ష కోట్లకు పైగా ఖర్చయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీ స్థాయిలో హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం, ప్రభుత్వ విద్య, వైద్య సేవల్లో పురోగతి, డిజిటల్ అక్షరాస్యత ద్వారా గ్రామీణులకు విజ్ఞానాన్ని అందించడం తదితర సేవలను అందుబాటులోకి తేవడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం కోసం అలాగే, దేశాభివృద్ధికి ఆస్కారం కలిగించే...బ్రాడ్‌బాండ్ హైవేలు, మొబైల్ కనెక్టివిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్, ఈ-గవర్నెన్స్, ఈ-క్రాంతి,ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ రంగాలకు ఊతమివ్వడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలోని కమిటీ ఈ పథకం పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ‘డిజిటల్ ఇండియా’ పథకం కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు జారి చేస్తుంది.