: డీఆర్ డీవో శాస్త్రవేత్తలకు మోడీ క్లాస్... బద్ధకం వదిలించుకుని పనిచేయండని వార్నింగ్
ప్రధానమంత్రి నరేంద్రమోడీ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శాస్త్రవేత్తలకు సీరియస్ క్లాస్ తీసుకున్నారు. డీఆర్డీవో 2013 అవార్డ్స్ ఫంక్షన్ లో మోడీ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మోడీ శాస్త్రవేత్తలకు హిత బోధ చేశారు. డీఆర్డీవో ప్రాజెక్టుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని.... దీనికి ప్రధాన కారణం శాస్త్రవేత్తల్లో పేరుకు పోయిన... ఛల్తా హై (ఏదో నడిచిపోతుందిలే) వైఖరేనని మోడీ స్పష్టం చేశారు. ఇలాంటి వైఖరి సరికాదని ఆయన విమర్శించారు. డీఆర్డీవో శాస్త్రవేత్తల్లో నైపుణ్యాలకు కొదవ లేదని... కేవలం ఇలాంటి వైఖరి వల్లే వెనుకబడిపోతున్నారని వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో టెక్నాలజీ చాలా వేగవంతంగా మారుతోందని... ఈ విషయంలో మనం చాలా వెనుకబడిపోయామని మోడీ అన్నారు. డీఆర్డీవో ఒక ఆలోచన అనుకుని... దానికి కార్యరూపం ఇచ్చే ప్రయత్నాల్లో ఉండగానే... మార్కెట్లోకి అంతకన్నా అధునాతన రక్షణరంగ ఉత్పత్తులు వచ్చేస్తున్నాయని శాస్త్రవేత్తలకు మోడీ గుర్తుచేశారు. 1992లో మొదలుపెట్టిన ప్రాజెక్టు గురించి 2014లో అడిగినా కూడా... ఆ ప్రాజెక్ట్ పూర్తవడానికి మరికొంత సమయం పడుతుందని చెప్పడం బాధ్యతారాహిత్యమని మోడీ అన్నారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలు ఇకనైనా సమయానికి తగ్గట్టు ప్రతిస్పందిస్తారో లేదా అలసత్వంతో అలాగే ఉంటారో నిర్ణయించుకోవాలని మోడీ ఘాటుగా వ్యాఖ్యానించారు. రక్షణరంగంలో భారత్ లీడర్ గా ఎదగాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. కాలం పరిగెడుతోందని... ఏ విషయంలోను ప్రపంచం వేచి చూస్తూ కూర్చోదని... ఈ కారణంగానే ప్రాజెక్టులను అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తిచేసి... ప్రపంచానికి మార్గదర్శిగా నిలవాలని సూచించారు. ప్రపంచం 2020లో ఏదో ఒక గొప్ప ప్రాడక్ట్ మార్కెట్లోకి తెస్తుందని తెలిస్తే... మనం 2018 లోనే అలాంటి ప్రాడక్ట్ ను రిలీజ్ చేయాలని మోడీ పేర్కొన్నారు. అనుకున్న సమయం కంటే ముందే పని పూర్తి చేయడం డీఆర్డీవో శాస్త్రవేత్తల ముందున్న పెద్ద ఛాలెంజ్ అని మోడీ వ్యాఖ్యానించారు.