: రజనీకాంత్ ను బీజేపీలోకి తీసుకువచ్చేందుకు చురుగ్గా పావులు కదుపుతోన్న అమిత్ షా
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు గాలం వేసే ప్రయత్నాలను బీజేపీ తీవ్రతరం చేసిందని తమిళనాడు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ విషయమై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రజనీకాంత్ తో ఇటీవలే ఫోన్ లో మాట్లాడినట్టు సమాచారం. రజనీకాంత్ ను బీజేపీ లోకి తీసుకువచ్చే బాధ్యతను నరేంద్రమోడీ అమిత్ షాకు అప్పజెప్పారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో అధికారంలోకి వచ్చేందుకు మోడీ ఇప్పటికే వ్యూహం ఖరారు చేశారని... ఈ వ్యూహంలో భాగంగానే రజనీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి 2016 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించాలని తమిళనాడు బీజేపీ వర్గాలు అంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్రమోడీ చెన్నై వచ్చినప్పుడు... రజనీకాంత్ ను ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలిశారు. గతంలో 'రాజకీయాల్లోకి వస్తారా?' అని రజనీని అడిగినప్పుడు... తాను రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేది దేవుడి ఆదేశం మీద ఆధారపడి ఉంటుందని... దేవుడు ఆదేశిస్తే తాను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని ఒకానొక సందర్భంలో రజనీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అమిత్ షా రజనీతో ఫోన్ లో మాట్లాడటం... తమిళనాట ఆయన రాజకీయ అరంగేట్రం పై భారీ చర్చకు దారి తీసింది. ఈ యేడాది ఆఖరులో తన పుట్టినరోజైన డిసెంబర్ 12న రాజకీయ ప్రవేశంపై రజనీ ఓ ప్రకటన చేయవచ్చని అభిమానులు, రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు.