: నేడు ముంబై వెళుతున్న టీఎస్ మంత్రులు నాయిని, మహేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డిల నాయకత్వంలోని బృందం నేడు ముంబై వెళుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వారు ఒక్కరోజు పర్యటనకు గాను ముంబై వెళుతున్నారు. హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచే అంశంలో భాగంగా... ముంబై ట్రాఫిక్ వ్యవస్థను అధ్యయనం చేయడానికి వీరు ఈ పర్యటన చేపట్టారు. పర్యటనలో భాగంగా మహారాష్ట్ర రవాణాశాఖ మంత్రితో పాటు ట్రాఫిక్, రవాణా అధికారులతో వీరు భేటీ అవుతారు. అంతే కాకుండా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లోని ట్రాఫిక్ వ్యవస్థను పరిశీలిస్తారు. ముంబై వెళ్లనున్న బృందంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్టీసీ జేఎండీ రమణారావు, అడిషనల్ పోలీస్ కమిషనర్ జితేందర్ ఉన్నారు.