: ఆన్ లైన్లో శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు... మరి క్యూ లైన్లో ఉన్న వారి సంగతేమిటి?


తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాదు, ప్రపంచ దేశాల నుంచి భక్తులు తిరుపతికి వస్తుంటారు. అక్కడి నుంచి కాలినడకన కొందరు, ఘాట్ రోడ్డుపై ఆర్టీసీ బస్సుల ద్వారా మరికొందరు, ప్రైవేటు వాహనాల్లో ఇంకొందరు... ఇలా తిరుమలేశుని దర్శనార్థం సప్తగిరుల పైకి చేరుకుంటారు. ఇక, అక్కడ అసలు కథ మొదలవుతుంది. క్యూలైన్లలో గంటలకొద్దీ వేచి చూసిన తర్వాత గాని ఏడుకొండల వారి దర్శన భాగ్యం కలగదన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తిరుమలలో సర్వదర్శనం, దివ్యదర్శనంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం సామాన్య భక్తులకు అందుబాటులో ఉంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం అంటే 300 రూపాయలు పెట్టి టిక్కెట్టు కొనుక్కొని క్యూలైన్ లోనికి ప్రవేశించాలి. అయితే, టీటీడీ కొత్తగా ఆన్ లైన్ ద్వారానే ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. ఆన్ లైన్ ద్వారా రోజుకు 5 వేల టిక్కెట్లు అమ్మాలని నిశ్చయించింది. ఇందులో 2,500 టిక్కెట్లు ఈ-దర్శన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మరో 2,500 టిక్కెట్లను ఇంటర్నెట్ ద్వారా ఇంటి నుంచే బుక్ చేసుకొనే వెసులుబాటు కల్పించారు. భక్తుల సౌకర్యం కోసమే ఆన్ లైన్ టిక్కెట్ పద్ధతిని ప్రవేశపెట్టామని టీటీడీ చెబుతోంది. ఇంటర్నెట్ పై అవగాహన ఉన్నవారే ఈ-టిక్కెట్లను బుక్ చేసుకునే వీలుంది. టీటీడీ వెబ్ సైట్ లోకి వెళ్లి లాగిన్ అయి పాస్ వర్డ్ ఎంటర్ చేసిన తర్వాతనే బుక్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిని ప్రవేశపెట్టిన తర్వాత ఒక్క నిమిషంలో 300 టిక్కెట్లు బుక్ అయిపోయాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఒక్కసారే వేలాది మంది సైట్ ఓపెన్ చేయడంతో సర్వర్ మొరాయిస్తోందని అంటున్నారు. సామాన్య భక్తులు దీనిపై మండిపడుతున్నారు. ఇంటర్నెట్ పరిజ్ఞానం అంతగా లేని తమ పరిస్థితి ఏమిటని వారు టీటీడీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. కొన్ని టిక్కెట్లను అయినా తిరుమల కొండపై అమ్మాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News