: ఆవాలు కూడా అనారోగ్యం కలుగజేస్తున్నాయ్!
పోపులో వేసే ఆవాలు తింటే అనారోగ్యం కలగడమేమిటి, అని ఆశ్చర్యపోతున్నారా? ఆవాలను పోపులో వేయడం వల్ల చేదెక్కుతోంది. కారణమేమిటో తెలుసా? ఆవాల్లో వామిటి గింజలను కలిపి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ తరహా కల్తీ జరుగుతోందని ఫుడ్ ఇన్ స్పెక్టర్లు చెప్పారు. ఏలూరులో ఇటీవల జరిపిన ఆవాల నాణ్యతా పరీక్షలో ఈ మోసం వెలుగుచూసింది. ఇంతకు ముందు ఆవాల్లో బ్రహ్మదండి విత్తనాలు కలిపి అక్రమ వ్యాపారాలు విక్రయించేవారు. దీనిపై అధికారులు కన్నేయడంతో అక్రమార్కులు రూటు మార్చారు. వామిటి గింజలను కలిపి తమ పని కానిచ్చేస్తున్నారు. వీరికి ప్రజారోగ్యం ఏమాత్రం పట్టడం లేదు. ఇలాంటి కల్తీలు జరిగినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.