: 'ఆ సాఫ్ట్ జాబ్ కు మీ వయసు చాలదులే'... మన్మోహన్ తో ఇందిర పలుకులివి
ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ పుస్తకం 'స్ట్రిక్ట్ లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్' ద్వారా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మన్మోహన్ మొదట వైద్యుడవ్వాలని భావించి, రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలుసుకున్నాం. తాజాగా, ఆయన గురించి మరో సంగతి వెలుగు చూసింది. భారత సివిల్ సర్వీసెస్ లో పదేళ్ళపాటు పనిచేసిన మన్మోహన్ ఆర్బీఐ గవర్నర్ పదవి ఆశించి ఇందిరను కలిసినప్పటి సంగతి ఇది. ఆమె చాంబర్లోకి వెళ్ళిన మన్మోహన్ జీ... తానింతవరకు చాలా కష్టసాధ్యమైన ఉద్యోగం చేసి వచ్చానని, ఇకపై ఏదైనా సాఫ్ట్ జాబ్ చూసుకోవాలనుకుంటున్నానని చెప్పారట. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ "అంతటి సాఫ్ట్ ఉద్యోగానికి అవసరమైన వయసు మీకు లేదు, మీరింకా 50ల్లోనే ఉన్నారు" అంటూ ఆర్బీఐ గవర్నర్ పోస్టు ఇవ్వ నిరాకరించారట. అయితే, 1980-85కు సంబంధించిన పంచవర్ష ప్రణాళిక సంఘంలో మన్మోహన్ కూడా ఓ సభ్యుడిగా ఉండాలని ఇందిర కోరుకున్నట్టు దమన్ తన పుస్తకంలో రాశారు.