: ధూంధాంగా తెలంగాణ తొలి గణేశ్ ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి గణేశ్ ఉత్సవాలను ధూంధాంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో ఇవాళ (బుధవారం) జరిగిన గణేశ్ ఉత్సవాల సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హుస్సేన్ సాగర్ సహా చెరువుల్లో పూడికతీతకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ద్వారా మట్టి విగ్రహాలను తయారుచేసి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీకి అందజేయాలని అధికారులు సూచించారు. గణేశ్ ఉత్సవాలకు కేటాయిస్తున్న నిధులను పెంచాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. గణేశ్ ఉత్సవాలకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని, ఉత్సవాల సమయంలో గణేశ్ మంటపాలకు 24 గంటలూ ఉచిత విద్యుత్తునివ్వాలని ఉత్సవ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది.