: బీసీసీఐ ఇచ్చిన 100 కోట్లు ఎంజాయ్ చేయడానికా?


భారతదేశం క్రీడల్లో ఎందుకు వెనుకబడిపోయిందో తెలిపే ఒక సంఘటన రెండు రోజుల క్రితం జరిగింది. దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నప్పటికీ... అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు ఎందుకు రాణించలేకపోతున్నారో ఈ సంఘటనను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. క్రింద వివరించిన సంఘటన క్రికెట్ కు సంబంధించినది అయినప్పటికీ... దీన్ని దేశంలోని మిగతా క్రీడలకు కూడా అన్వయించుకోవచ్చు. వివరాల్లోకి వెళితే... ఇటీవలే కర్ణాటక క్రికెట్ అధ్యక్షుడు బ్రిజేష్ పటేల్ అధ్యక్షతన అసోసియేషన్ వార్షిక సమావేశం జరిగింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సభ్యులు 129 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం మధ్యలోనే మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్ లు ఆవేశంగా వాకౌట్ చేశారు. ఇంతకీ వివాదమేమిటంటే... ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీసీఐ ఇచ్చిన 100 కోట్లు ఎలా ఖర్చుపెట్టాలనే విషయం చర్చకు వచ్చింది. ఈ 100 కోట్లను కర్ణాటక క్రికెట్ అసోషియన్ కు ఉన్న క్లబ్ హౌస్ లు, కన్వెన్షన్ సెంటర్లలో ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి వినియోగించాలని బ్రిజేష్ పటేల్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు మెజార్టీ సభ్యులు వెంటనే ఒప్పుకోగా... అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్ లతో పాటు మరో పదిమంది సభ్యులు తీవ్ర వ్యతిరేకత తెలిపారు. ఈ 100 కోట్లు కర్నాటక రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి కేటాయించాలని వారు వాదించారు. బెంగళూరు, మైసూరు నగరాల్లో తప్ప... కర్నాటకలో మరెక్కడా టర్ఫ్ వికెట్లు లేవని... ఈ నిధులతో రాష్ట్రమంతటా టర్ఫ్ వికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు... వర్థమాన క్రికెటర్లకు కావాల్సిన మెరుగైన సౌకర్యాలు కల్పిద్దామని అనిల్ కుంబ్లే ప్రతిపాదించాడు. క్రికెట్ మీద వచ్చిన ఆదాయం క్రికెట్ అభివృద్ధికే ఖర్చుపెట్టాలని... అంతేగానీ క్లబ్ హౌస్ ల్లో సభ్యులు ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెట్టకూడదని కుంబ్లే, శ్రీనాథ్ లు గట్టిగా వాదించారు. దీనికి మెజార్టీ సభ్యులు ఒప్పుకోకపోవడంతో... కుంబ్లే, శ్రీనాథ్ ఆగ్రహావేశాలతో సమావేశం నుంచి బయటకు వచ్చారు.

  • Loading...

More Telugu News