: సచిన్ తో కలిసి భారత సాకర్ ను అభివృద్ధి చేస్తానంటున్న ఇంగ్లండ్ మాజీ గోల్ కీపర్
భారత్ లో సాకర్ పై ఫిఫా ఇటీవల ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) వంటి ఛాంపియన్ షిప్ ల నిర్వహణకు మార్గదర్శనం చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక లీగ్ లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఓ జట్టును సొంతం చేసుకున్నాడు. సాకర్ ను ఎంతగానో అభిమానించే సచిన్ కేరళ బ్లాస్టర్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. కాగా, తన జట్టు కోసం సచిన్ ఇంగ్లండ్ మాజీ గోల్ కీపర్ డేవిడ్ జేమ్స్ సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించాడు. జేమ్స్ ఈ టోర్నీలో కేరళ బ్లాస్టర్స్ కు ఆటగాడిగానూ, కోచ్ గానూ వ్యవహరిస్తాడు. దీనిపై జేమ్స్ మాట్లాడుతూ, ఐదారువారాల క్రితం సచిన్ తో సంభాషించానని తెలిపాడు. సాకర్ పై ఇరువురం అభిప్రాయాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలను పంచుకున్నామని, సచిన్ ఓ అద్భుతమైన వ్యక్తి అని పేర్కొన్నాడు. తానేమీ క్రికెట్ ఫ్యాన్ కాదని, సచిన్ తో భేటీ సందర్భంగా క్రికెట్ కంటే ఫుట్ బాల్ పైనే ఎక్కువగా మాట్లాడుకున్నామని వివరించాడు. సచిన్ నిర్మాణాత్మక దృక్పథం ఉన్న వ్యక్తని జేమ్స్ ఈ సందర్భంగా కొనియాడాడు. భారత సాకర్ ను ఉన్నత శిఖరాలకు చేర్చాలన్న తపన అతనిలో కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. కాగా, ఇంగ్లండ్ లో కంటే భారత్ లో ఫుట్ బాల్ క్రీడపై అనురక్తి విభిన్నంగా కనిపిస్తోందని చెప్పాడు.