: దేశంలోని అవినీతిపై కసి, కక్ష పెంచుకున్న నరేంద్రమోడీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలోని అవినీతిపై కసి, కక్ష పెంచుకున్నారు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మాట్లాడిన ప్రతీ సభలో దేశంలోని అవినీతి విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఉదాహరణకు మొన్న కాశ్మీర్ పర్యటనలో... నిన్న ఢిల్లీ ఎర్రకోట ప్రసంగంలో దేశంలోని అవినీతిపై ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ఏ ప్రధానమంత్రి చేయని విధంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదాహరణకు కాశ్మీర్ పర్యటనలో దేశ ప్రజల సంక్షేమం... అభివృద్ధి కోసం నిధులు పుష్కలంగా ఖర్చుపెడుతున్నా... అవినీతి కారణంగా అవి అందాల్సిన ప్రజలకు అందటం లేదని అన్నారు. అలాగే ఎర్రకోట ప్రసంగంలో మాట్లాడుతూ... ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు ఏదైనా పనికోసం వెళ్లినప్పుడు "ఈ పని చేస్తే నాకేంటి... అసలు నాకెంత?" అని ప్రభుత్వ ఉద్యోగులు నిస్సిగ్గుగా అడుగుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నిన్న హర్యానా పర్యటనలో మోడీ దేశంలో అవినీతి భూతంపై విరుచుకు పడ్డారు. అవినీతి కేన్సర్ కన్నా ప్రమాదకరమైనదని... దేశాన్ని నాశనం చేస్తోందని మోడీ వ్యాఖ్యానించారు. కేన్సర్ కన్నా వేగంగా వ్యాపిస్తూ... దేశానికి ప్రమాదకరంగా పరిణమించిన అవినీతిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన బహిరంగ సభలో ఆవేశంగా చెప్పారు. ప్రజల ఆశీస్సులు ఉంటే త్వరలోనే అవినీతి జాఢ్యం నుంచి దేశానికి విముక్తి కలిగిస్తానని పేర్కొన్నారు. మోడీ వ్యాఖ్యల నేపథ్యంలో... త్వరలోనే కేంద్ర సర్కార్ దేశంలో అవినీతిని నిరోధించడానికి ఓ విధానాన్ని తీసుకురావచ్చని ఢిల్లీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.