: న్యూస్ రీడర్ ముఖం కనిపించిందని... వివరణ ఇచ్చిన టీవీ చానెల్!
న్యూస్ రీడర్ ముఖం కనపడితే మతపెద్దలకు వివరణ ఇవ్వడమేంటి? ముఖం కనపడకుండా వార్తలు చదువుతారా? అనే అనుమానం కలిగిందా? అయితే చదవండి... ఇటీవల లండన్‌లో ఉన్న ‘అల్ ఎ ఖబరియా’ సౌదీ చానెల్ స్టూడియో నుంచి ఓ యువతి వార్తలు చదివింది. ఆ సమయంలో ఆమెను చూసిన ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఎందుకంటే ఆమె బురఖా ధరించలేదు. ఓ ముస్లిం చానెల్లో, ముస్లిం యువతి ఆ విధంగా వార్తలు చదవడం సంచలనాన్ని సృష్టించింది. ఈ చానెల్లో కార్యక్రమాలకు అతిథిగా వచ్చే విదేశీ వనితలకు తప్ప, మరెవరరికీ తల మీద ముసుగు లేకుండా కనిపించే హక్కు లేదు. అందుకే ఆ న్యూస్ రీడర్ ను చూసి ఆశ్చర్యపోయారు. ఇది తీవ్రమైన మత ద్రోహమంటూ మతగురువులు, పెద్దలు తీవ్ర విమర్శలు గుప్పించారు. దాంతో భయపడిన చానెల్ నిర్వాహకులు ఆమె తమ చానెల్ ఉద్యోగి కాదని, లండన్‌కు చెందిన గెస్ట్ న్యూస్ రీడర్ అని, అందువల్లే పొరపాటు జరిగిందని మత పెద్దలకు వివరణ ఇచ్చింది. ఈ వివరణ హక్కుల కార్యకర్తలను మండిపడేలా చేసింది. మహిళా స్వేచ్ఛకు తీవ్ర భంగంగా భావించిన హక్కుల కార్యకర్తలు చానెల్ స్టేట్‌మెంట్‌తో తీవ్రనిరాశకు గురయ్యారు. ముస్లిం న్యూస్ రీడర్లకు ముఖాన్ని చూపించే హక్కు లభించేవరకూ పోరాడతామని హెచ్చరిస్తున్నారు. మతఛాందసవాదం నరనరాన జీర్ణించుకున్న దేశాల్లో అది సాధ్యమేనా? మతపెద్దలు అంగీకరిస్తారా? చూడాల్సిందే!