: హైదరాబాద్ లో కోటీ 20 లక్షల పైగా జనాభా ఉంది: కేసీఆర్
సర్వే అనుకున్న దానికంటే ఉన్నతమైన ఫలితాలు సాధించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తాజా సర్వే కారణంగా హైదరాబాదులో కోటీ 20 లక్షల మందికిపైగా ప్రజలు ఉన్నట్టు తెలిసిందని అన్నారు. సర్వే ద్వారా చాలా విషయాలు తెలిశాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఇలాగే సహకరిస్తే బంగారు తెలంగాణ సాధిస్తామని ఆయన తెలిపారు. రానున్న కొద్ది రోజుల్లో ఎక్కడ చూసినా వివరాలు ఉంటాయని, అర్హులకు లబ్ధి చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. సర్వేకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పైసా ప్రతిఫలం ఆశించకుండా పని చేసిన ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం యువతులుకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా 51 వేల రూపాయలు అందజేస్తామని ఆయన తెలిపారు. ఆ డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాలోకి వెళ్లిపోతుందని ఆయన వెల్లడించారు. హైదరాబాదు అవసరాలు తీర్చేందుకు సర్వే బాగా ఉపయోగ పడిందని ఆయన వివరించారు. రాత్రి 8 వరకు సర్వే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాత్రి ఏ సమయానికైనా వివరాలు వస్తాయని ఆయన తెలిపారు. ఎవరైనా తప్పిపోతే వారు నమోదు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. సర్వేపై విమర్శలు చేసినవారు ఇప్పుడేమంటారని ఆయన ప్రశ్నించారు. ఈ వివరాలన్నీ 15 రోజుల్లో కంప్యూటరీకరిస్తామని ఆయన తెలిపారు. ఈ సర్వే చారిత్రాత్మకం అని ఆయన పేర్కొన్నారు.