: సీన్ రివర్స్ ... ప్రేమించలేదని యువకుడిపై యువతి ఘాతుకం!
ప్రేమించలేదని నిత్యం మహిళలపై పురుషుల దాడులు చూస్తున్నాం. అయితే, ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. మగవారికి తానేమీ తీసిపోలేదని అనుకుందో, ఏమో తెలియదు కాని జగ్గయ్యపేటకు చెందిన రమణి అనే యువతి దారుణానికి ఒడిగట్టింది. తనను ప్రేమించని రాముపై ఆమె కత్తితో దాడి చేసింది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. తనను ప్రేమించమని రాము వెంట పడింది రమణి. అయితే, రాము ఆమె ప్రేమను అంగీకరించలేదు. అంతేకాక వేరే యువతిని అతడు నాలుగు రోజుల క్రితం పెళ్లి కూడా చేసుకున్నాడు. అంతే... భగ్న ప్రేమికురాలుగా మారిన రమణి, రాముపై పగ పెంచుకుంది. తనకు దక్కని రాము, మరే యువతికీ దక్కరాదని భావించింది. అనుకున్నదే తడవుగా రాముపై కత్తితో దాడి చేసింది. రాముపైకి లంఘించి అతడి గొంతుపై కత్తితో పొడిచేసింది. అయితే ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్న రాము ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న జగ్గయ్యపేట పోలీసులు భగ్న ప్రేమికురాలు రమణిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, తన చర్యను సమర్థించుకున్న రమణి, ప్రేమ పేరిట తనను వంచించినందుకే రాముపై దాడికి పాల్పడినట్లు చెప్పింది.