: భారత్ కఠిన నిర్ణయానికి ముందు... ఓ ఫోన్ కాల్ హెచ్చరిక!
మరో వారంలో భారత్, పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శులు పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో భేటీ అయ్యేవారే. అయితే కాశ్మీర్ వేర్పాటువాదులతో భారత్ లో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్ సోమవారం నాటి సమావేశం ఆ భేటీని రద్దు చేసేసింది. అయితే విదేశాంగ కార్యదర్శుల భేటీని రద్దు చేసే ముందు భారత్ ఆచితూచీ అడుగులేసిందనే చెప్పాలి. రెండేళ్ల విరామం తర్వాత తిరిగి ప్రారంభం కానున్న ద్వైపాక్షిక చర్చలకు తలుపులు మూయడం అంత సులువు కాదు కదా! కాశ్మీరీ వేర్పాటువాదులను చర్చలకు పిలుస్తూ అబ్దుల్ బాసిత్ ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిన వెంటనే భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ అప్రమత్తమయ్యారు. "చర్చలు ఎవరితో జరుపుతారన్న విషయాన్ని మీరే తేల్చుకోండి. భారత్ తోనా? లేక కాశ్మీరీ వేర్పాటువాదులతోనా?’’ అంటూ ఆమె బాసిత్ కు ఫోన్ చేశారట. అయితే సుజాతా సింగ్ హెచ్చరికను బేఖాతరు చేస్తూ బాసిత్, సోమవారం మద్యాహ్నం కాశ్మీరీ వేర్పాటువాదులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత వేగంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో భారత్, పాక్ తో చర్చలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.