: నేడు తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే నేటి ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా మొదలు కానుంది. సర్వే కోసం ప్రభుత్వ సిబ్బందితో పాటు ప్రైవేటు సంస్థల సిబ్బంది, కళాశాల విద్యార్థులతో కూడిన మొత్తం 3.71 లక్షల మంది ఎన్యూమరేటర్లు పాల్పంచుకోనున్నారు. రాష్ట్రంలోని మొత్తం పది జిల్లాల్లో ఒకేసారి జరగనున్న ఈ సర్వే, ఇకపై రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల అమలుకు ఆధారం కానుంది. ఈ నేపథ్యంలో జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు తరలివెళ్లిన తెలంగాణ వాసులు తిరిగి తమ స్వస్థలాలకు తిరిగివచ్చారు. నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న సర్వే, రాత్రి 8 గంటల దాకా నిర్విఘ్నంగా కొనసాగనుంది. సర్వేలో భాగంగా మొత్తం 94.49 లక్షల కుటుంబాలకు చెందిన సమగ్ర వివరాలు సేకరిస్తారు. సమగ్ర సర్వే నేపథ్యంలో వివరాల కోసం ప్రభుత్వం tsks.nic.in పేరిట ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించింది. సర్వే పూర్తి కాగానే నేటి రాత్రే రికార్డులన్నిటినీ అధికారులు సీజ్ చేయనున్నారు. సర్వే వివరాలను సెప్టెంబర్ 6 లోగా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయనున్నారు. ఇళ్ల లెక్కన కుటుంబాల సంఖ్యను నిర్ధారించే పద్దతికి స్వస్తి చెప్పిన తెలంగాణ ప్రభుత్వం, ఇంటిలో ఉన్న వంట గదుల లెక్కనే పరిగణనలోకి తీసుకుని కుటుంబాల సంఖ్యను లెక్కించనుంది.