: అతడిని ఇంటికి పంపితే టీమిండియా బాగుపడుతుంది: మాజీ క్రికెటర్లు


ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా ఘోరపరాభవం నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు సునిశితమైన విమర్శల దాడికి శ్రీకారం చుట్టారు. ఇందుకు కోచ్ డంకన్ ఫ్లెచరే బాధ్యుడని, వెంటనే ఆయనను పదవి నుంచి సాగనంపాలని వారు సూచించారు. ఈ సిరీస్ లో ఫ్లెచర్ చేసింది శూన్యమని... అతడిని తొలగించి, మరొకరికి కోచింగ్ పగ్గాలు అందించాల్సిన తరుణం ఇదేనని స్పష్టం చేశారు. మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ మాట్లాడుతూ, లార్డ్స్ లో కష్టసాధ్యమైన పిచ్ పై ఆడి నెగ్గిన తర్వాత ఫ్లెచర్ ఏం చేస్తున్నట్టు? అని ప్రశ్నించారు. ఆ ఆధిక్యాన్ని కొనసాగించాలన్న ఆలోచన అతడిలో కొరవడిందని మండిపడ్డారు. ఫ్లెచర్ పదవి నుంచి వైదొలిగితే మంచిదని వాడేకర్ అభిప్రాయపడ్డారు. స్పిన్ లెజెండ్ ఎరాపల్లి ప్రసన్న మాట్లాడుతూ, జట్టు కోసం ఫ్లెచర్ చేసింది ఓ పెద్ద సున్నా మాత్రమే అని వ్యాఖ్యానించారు. మాజీ చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ప్రసన్నతో ఏకీభవించారు. ఫ్లెచర్ భారత జట్టు కోసం ఏమీ చేయలేదని అన్నారు. అంతేగాకుండా, కొందరు మాజీలు టెస్టు క్రికెట్ సారథిగా ధోనీ టైం ఎక్స్ పైర్ అయిపోయిందని వ్యాఖ్యానించారు. ఇక, అతను పగ్గాలు ఇతరులకు అప్పగించాలని సూచించారు.

  • Loading...

More Telugu News