: తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు సింగపూర్ తరహా వ్యవస్థ?
తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల అనుమతికి సింగపూర్ తరహా వ్యవస్థను అనుసరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆ దేశంలో పరిశ్రమల ఏర్పాటుకు 'సింగిల్ విండో సిస్టమ్' ద్వారా అనుమతులు ఇస్తున్న విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఈ నెల 22, 23న సీఎం కేసీఆర్ సింగపూర్ లో పర్యటిస్తారు. అప్పుడే ఆ విధానంపై పూర్తిగా తెలుసుకోనున్నారట. దాంతో, తక్కువ సమయంలో ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామిక విధానంలో విజయం సాధించవచ్చని అనుకుంటున్నారు. ఈ క్రమంలో కొత్త పరిశ్రమల పాలసీ ప్రకటనలో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ కు సంబంధించిన ముసాయిదా ప్రక్రియను కూడా మొదలుపెట్టిందట. దాంతో, రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తోంది. ఇందుకోసం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా సీఎం, సీనియర్ అధికారులతో కలసి సింగపూర్ వెళ్లనున్నారు. అక్కడ రాఫెల్స్ సిటీలో ఐఐఎం పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేసే సమావేశంలో కేసీఆర్ ప్రసంగిస్తారు.