: భూమి దిశగా దూసుకువస్తోన్న మరో ఉపద్రవం!
కోట్లాది సంవత్సరాల క్రితం ఓ భారీ గ్రహశకలం ప్రస్తుతం మెక్సికో ఉన్న ప్రాంతాన్ని ఢీకొట్టడంతో డైనోసార్ల యుగం అంతరించిపోవడం గురించి తెలుసుకున్నాం. తాజాగా, అలాంటి ఉపద్రవమే మరొకటి భూమి దిశగా దూసుకువస్తోందని బ్రిటన్ కు చెందిన డైలీ స్టార్ పత్రిక పేర్కొంది. ఇదో గ్రహశకలమని, 1000 మీటర్ల వ్యాసార్థంతో ఉన్న ఈ ఆస్టరాయిడ్ గంటకు దాదాపు 40వేల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తోందని తెలిపింది. దీని పేరు 1950 డీఏ అని, ఇది భూమిని తాకితే సునామీలు సంభవించడం, నగరాలకు నగరాలే నాశనమవడం వంటి ఉత్పాతాలు చోటుచేసుకుంటాయని డైలీ స్టార్ తన కథనంలో వివరించింది. అయితే, ఇది 2880 మార్చి 16 నాటికి గానీ భూవాతావరణంలో ప్రవేశించదట. కాగా, 50 మీటర్ల వ్యాసార్థం మించి ఉండే గ్రహశకలాలు నగరాలను నేలమట్టం చేయగలిగే శక్తిని కలిగి ఉంటాయని నాసా చెబుతోంది.