: ఈ సౌతిండియా సిటీకి 375 ఏళ్ళు!
భారత్ లో తొలి ఆధునిక నగరంగా పేరుగాంచిన చెన్నై ఈ ఆగస్టు 22న 375వ జన్మదినోత్సవం జరుపుకోనుంది. బ్రిటీష్ వారు భారత్ లో ప్రవేశించిన తర్వాత తమిళనాట నాయక్ రాజులు వారికి కొంత భూభాగాన్ని ధారాదత్తం చేశారు. అక్కడ తెల్లదొరలు సెయింట్ జార్జ్ కోటను నిర్మించగా, దాని చుట్టూ విస్తరించిందే నేడు మనం చెన్నైగా పిలుచుకుంటున్న చెన్నపట్నం. భారతదేశంలో నిర్మితమైన తొలి ఆధునిక నగరం ఇదేనని చరిత్రకారులు చెబుతున్నారు. అనంతరం అది మదరాసు, మద్రాసుగా రూపాంతరం చెంది చివరికి చెన్నైగా స్థిరపడింది. దీనిపై ఎస్.ముత్తయ్య అనే చరిత్రకారుడు మాట్లాడుతూ, కోల్ కతా నగరం మద్రాసు కంటే 50 సంవత్సరాల తర్వాత ఏర్పడిందని, ముంబయి అయితే 35 సంవత్సరాల తర్వాత రూపొందిందని వెల్లడించారు. తొలుత మద్రాసు నుంచే బ్రిటీష్ వారి కార్యకలాపాలు సాగాయని, అనంతరం వ్యాపార విస్తరణను దృష్టిలో ఉంచుకుని పాలనాకేంద్రంగా కోల్ కతాను ఎంచుకున్నారని ముత్తయ్య వివరించారు. చెన్నై మునిసిపల్ కార్పొరేషన్ భారత్ లోనే అత్యంత ప్రాచీనమైనది. 1688లో ఇది ఏర్పడింది. కాగా, చెన్నై జన్మదినోత్సవం నేపథ్యంలో తమిళనాడు సర్కారు వారోత్సవాలకు తెరదీసింది.