: పాక్ రైల్వే వెబ్ సైట్ పై భారత హ్యాకర్ల ప్రతీకార దాడి...
భారత్ కు చెందిన హ్యాకర్ల బృందం పాకిస్థాన్ రైల్వే వెబ్ సైట్ లోకి ప్రవేశించినట్టు 'ద న్యూస్ ఇంటర్నేషనల్' దినపత్రిక పేర్కొంది. సదరు హ్యాకర్ల గ్రూప్ పేరు 'బ్లాక్ డ్రాగన్ ఇండియన్ హ్యాకర్ ఆన్ లైన్ స్క్వాడ్' అని పత్రిక తెలిపింది. ఈ దాడికి తమదే బాధ్యత అని బ్లాక్ డ్రాగన్ గ్రూప్ ప్రకటించుకుందని కూడా పత్రిక వెల్లడించింది. కాగా, రైల్వే వెబ్ సైట్ లోకి అక్రమంగా ప్రవేశించిన హ్యాకర్లు అక్కడో సందేశం ఉంచారట. "హలో, పాకిస్థాన్ పౌరులారా... ఈ సైట్ ను మేం బ్లాక్ చేశాం. భారత్ కు చెందిన కాశ్మీర్లో ఎన్నో ఏళ్ళుగా నెత్తుటి చరిత్రకు కారణంగా నిలుస్తోంది పాకిస్థాన్. పెద్ద సంఖ్యలో భారత ప్రభుత్వ వెబ్ సైట్లను మీ సైబర్ సోదరులు (పాకిస్థానీ) హ్యాక్ చేశారు. మేం ఇస్లాంను, ముస్లింలను ప్రేమిస్తాం, కానీ, పాకిస్థానీలను మాత్రం ద్వేషిస్తాం. త్వరలోనే పాకిస్థాన్ విద్యుత్ సంస్థల వెబ్ సైట్లు, వాణిజ్య బ్యాంకుల వెబ్ సైట్లపైనా దాడులు చేస్తాం" అంటూ హెచ్చరించారని 'ద న్యూస్ ఇంటర్నేషనల్' పత్రిక పేర్కొంది.